అర్ధరాత్రి గుడిసెలోకి చొరబడి దాడి
ఫోన్ దోచుకునేందుకు యత్నం
– ప్రతిఘటించడంతో కత్తితో దాడి
– బాలుడి కేకలతో పరారైన దుండగుల
– రాబరీ కేసు నమోదు
సైబరాబాద్ – విశాల భారతి
హుడా కాలనీలో రైల్వే పట్టాల పక్కన ఉన్న గుడిసెలో నివసిస్తున్న 16 ఏళ్ల బాలుడిపై అర్ధరాత్రి ఇద్దరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మంచినీళ్లు కావాలంటూ నమ్మించి గుడిసెలోకి ప్రవేశించిన దుండగులు సెల్‌ఫోన్‌ను దోచుకునేందుకు యత్నించగా, బాలుడు ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రాబరీ యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. జాన్ సయ్యద్ అనే 16 ఏళ్ల బాలుడు హుడా కాలనీలోని రైల్వే ట్రాక్ సమీపంలోని గుడిసెలో ఒంటరిగా ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంచినీళ్లు కావాలని అడిగారు. బాలుడు వాటర్ బాటిల్ ఇవ్వగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత మద్యం మత్తులో తిరిగి వచ్చి నేరుగా గుడిసెలోకి ప్రవేశించారు.లోపలికి వెళ్లిన దుండగులు బాలుడిని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో బాలుడు గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించాడు. దీంతో ఆగ్రహించిన నిందితులు అక్కడే ఉన్న కత్తితో బాలుడిపై దాడి చేయగా, అతని చేతికి గాయాలయ్యాయి.బాలుడి అరుపులు విన్న స్థానికులు ఘటనాస్థలానికి పరుగెత్తుకొచ్చేలోపే దుండగులు తాము వచ్చిన స్కూటీపై వేగంగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడిన బాలుడికి ప్రథమ చికిత్స అందించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు రాబరీ యత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను సేకరిస్తున్నారు. నిందితుల కదలికలను గుర్తించి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
