ఆర్మీ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు
– హైడ్రా కమిషనర్‌ను అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశం
సైబరాబాద్ – విశాల భారతి
లోతుకుంటలోని ఆర్మీ భూముల్లో జోక్యం చేసుకుంటే హైడ్రా అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను అరెస్ట్ చేయాలని, హైడ్రా, పోలీసు అధికారులు ఎవరైనా వస్తే వారిని ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీకి సూచించింది.లోతుకుంట ఆర్మీ భూముల విషయంలో జోక్యం చేసుకోవడంపై రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రాపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారంపై సోమవారం సాయంత్రం కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా హైకోర్టు ముందు హాజరయ్యారు.విచారణ సందర్భంగా మళ్లీ ఆర్మీ భూముల జోలికి వెళితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆర్మీకి కోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులపై తమకు నమ్మకం పోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఆర్మీ భూముల్లో ఎలాంటి కూల్చివేతలు, తనిఖీలు చేపట్టవద్దని ఇప్పటికే స్పష్టం చేసిన కోర్టు, ఇప్పుడు ఉల్లంఘిస్తే అరెస్టుల వరకు వెళ్తామని హెచ్చరించింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలతో హైడ్రా కార్యకలాపాలపై తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.
