A place where you need to follow for what happening in world cup

- Advertisement -

స్విగ్గీ ప్రతినిధులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం  

0 86

స్విగ్గీ ప్రతినిధులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం
– ఫుడ్ సేఫ్టీ నిబంధనల కఠిన అమలుకు చర్యలు

సైబరాబాద్ – విశాల భారతి
ఆహార భద్రతా నిబంధనల అమలును మరింత పటిష్టం చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గుమ్మల శ్రీజన అధ్యక్షతన స్విగ్గీ ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల నుంచి మెరుగైన నియంత్రణ, సమన్వయం కోసం ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సైబరాబాద్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఆహార పంపిణీ వేదికల ద్వారా విక్రయించే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్స్‌ను కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలని నిర్ణయించారు. దీన్ని స్విగ్గీ యాప్‌లో అప్‌లోడ్ చేసేలా చూడాలని సూచించారు. సీఎంసీతో సమన్వయం కోసం స్విగ్గీ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని, లైసెన్సులు, ఫిర్యాదులు, తనిఖీలకు సంబంధించిన అంశాలను ఆయన పర్యవేక్షించాలని తెలిపారు.కొత్తగా ఆన్‌బోర్డింగ్ అయ్యే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల కోసం ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాలని, లైసెన్సు లేని, నిబంధనలు పాటించని వారిని ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించే విధానం అమలు చేయాలని ఆదేశించారు. క్లౌడ్ కిచెన్లు, ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో చట్టబద్ధమైన నిబంధనల అమలుపై తనిఖీలను ముమ్మరం చేయాలని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్ గుమ్మల శ్రీజన మాట్లాడుతూ సైబరాబాద్‌లో సురక్షితమైన, పరిశుభ్రమైన, నిబంధనలకు అనుగుణమైన ఆహార సేవలను ప్రజలకు అందించేందుకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో నిరంతరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.