ఉచిత టూర్ పేరుతో రూ. 22 లక్షల టోకరా
– హాలిడే మెంబర్‌షిప్ పేరుతో 15 మందికి మోసం
– గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు ముమ్మరం
సైబరాబాద్ – విశాల భారతి
ఉచిత కూపన్లు, ఆకర్షణీయమైన బహుమతులు, విలాసవంతమైన టూర్ ప్యాకేజీల పేరుతో అమాయకులను వలలో వేసుకుని లక్షల రూపాయలు కాజేస్తున్న ముఠా గుట్టును గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. హాలిడే మెంబర్‌షిప్ పేరుతో తక్కువ ఖర్చులో దేశ, విదేశీ పర్యటనలు కల్పిస్తామని నమ్మించి పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు 15 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించగా, వారి నుంచి రూ.22 లక్షలకు పైగా వసూలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం న్యూఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 4ఆర్ సీజన్స్ హాలిడేస్ ప్రైవేట్ లిమిటెడ్, ది పసిఫిక్ హాలిడే వరల్డ్ సంస్థల పేరుతో రాజేష్ కుమార్, ముఖర్జీ రిలన్ అగర్, అల్ఫు యాదవ్, రామ్ సింగ్ రామ్ తదితరులు ఈ మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్స్, కమర్షియల్ ప్రాంతాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ఉచిత కూపన్లు, గిఫ్ట్ వోచర్లు, లక్కీ డ్రా బహుమతుల పేరుతో ప్రజలను ఆకర్షించేవారు. అనంతరం ఎంపికైనట్లు చెప్పి వారిని నగరంలోని ప్రముఖ స్టార్ హోటళ్లకు, ముఖ్యంగా రాడిసన్ హోటల్‌కు ఆహ్వానించి హాలిడే మెంబర్‌షిప్ పథకాలపై గంటల తరబడి ప్రజెంటేషన్లు ఇచ్చేవారు.
రూ. లక్షా 25 వేలు చెల్లిస్తే ఐదేళ్లపాటు ప్రతి సంవత్సరం ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల దేశీయ టూర్ సౌకర్యం కల్పిస్తామని, 10 ఏళ్ల మెంబర్‌షిప్ తీసుకుంటే దేశంతో పాటు విదేశీ పర్యటనలు కూడా ఏర్పాటు చేస్తామని నమ్మించేవారు. ప్రత్యేక డిస్కౌంట్లు, జీవితకాల ప్రయోజనాలు, కుటుంబ సభ్యులకు అదనపు సదుపాయాలు, ఆకర్షణీయమైన సర్టిఫికెట్లు చూపిస్తూ వినియోగదారులను ఒప్పించేవారు. సమావేశం ముగిసేలోపే నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చి, క్రెడిట్ కార్డులను స్వైప్ చేయించి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో బాధితుల్లో ఒకరు ఈ నెల 24న గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 16న గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌కు పిలిపించి పలు హామీలు ఇచ్చి తన నుంచి క్రెడిట్ కార్డు ద్వారా రూ.3.40 లక్షలు చెల్లించేలా చేశారని, డబ్బు చెల్లించిన తర్వాత ఒప్పందంలో పేర్కొన్న సేవలు అందించకపోగా సంస్థ ప్రతినిధులు సరైన స్పందన కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో ఇదే తరహాలో మోసపోయిన మరో 14 మంది కూడా ముందుకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన ఫిర్యాదుల ఆధారంగా నిందితులు సుమారు రూ.22 లక్షలకు పైగా వసూలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. మరిన్ని బాధితులు ఉండే అవకాశముందని భావిస్తున్న పోలీసులు సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, నిర్వాహకుల పాత్రపై లోతుగా విచారణ చేపట్టారు.
ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా హాలిడే లేదా పెట్టుబడి పథకంలో చేరే ముందు సంస్థ విశ్వసనీయతను పూర్తిగా నిర్ధారించుకోవాలని, ఆకర్షణీయమైన ఆఫర్లకు వెంటనే ఆకర్షితులై డబ్బు చెల్లించవద్దని హెచ్చరించారు. ఒప్పంద పత్రాలను పూర్తిగా చదివిన తర్వాతే సంతకాలు చేయాలని, క్రెడిట్ కార్డులను స్వైప్ చేయాలని ఒత్తిడి చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి మోసాలకు గురైన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా సైబర్ నేరాల విభాగాన్ని సంప్రదించి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
