శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
– భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు
సైబరాబాద్ – విశాల భారతి
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.సమాచారం అందిన వెంటనే సీఐఎస్‌ఎఫ్ అధికారులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. విమానాశ్రయ ప్రాంగణం మొత్తంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని టెర్మినళ్లు, పార్కింగ్ ప్రాంతాలు, లగేజీ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.బెదిరింపు సమాచారం నేపథ్యంలో కొద్దిసేపు విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. తనిఖీలు పూర్తయిన తర్వాత యథావిధిగా విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని సీఐఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు.
