లడ్డూ రికార్డుల గణేష్‌పై చీటింగ్ కేసు!
సైబరాబాద్ – విశాల భారతి
గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధరలతో వార్తల్లో నిలిచిన మాదాపూర్ ‘మైహోమ్ భుజా’ నివాసి కొండపల్లి గణేష్‌పై రూ. 3.45 కోట్ల మోసం కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నెలకు 6 శాతం లాభాలు ఇస్తానని నమ్మించి అపార్ట్‌మెంట్ నివాసుల నుంచి విడతలవారీగా రూ.3.45 కోట్లు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు.కొంతకాలం తర్వాత లాభాలతో పాటు అసలు చెల్లించకుండా కాలయాపన చేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన గణేష్, 2024లో రూ. 29 లక్షలు, 2025లో రూ. 51,07,777లకు లడ్డూను దక్కించుకుని రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ సామాజిక గుర్తింపునే ఆసరాగా చేసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు కేసు నమోదు చేసి, బ్యాంకు లావాదేవీలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
