ప్రజారోగ్యం, పారిశుధ్యంపై సైబరాబాద్ కార్పొరేషన్ సమీక్ష
– వర్షాకాల వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి
– క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కమిషనర్ శ్రీజన ఆదేశం
సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో ప్రజారోగ్యం, పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని కమిషనర్ గుమ్మల శ్రీజన అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నివారణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి సర్కిల్‌లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు.
కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజారోగ్యం, పారిశుధ్య సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ (ఆరోగ్యం, పారిశుధ్యం), జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆరోగ్యాధికారులు, పారిశుధ్య విభాగం అధికారులు పాల్గొన్నారు. ఆయా సర్కిళ్లలో ప్రస్తుతం అమలవుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను అధికారులు కమిషనర్‌కు వివరించారు.
సమావేశంలో బల్క్ వేస్ట్ జనరేటర్ల నమోదును వేగవంతం చేయడంతో పాటు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు చేపడుతున్న చర్యలు, ఆకాంక్ష టాయిలెట్ల నిర్మాణ పురోగతి, స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల వినియోగం, పారిశుధ్య మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి సర్కిల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు పొగమందు పిచికారీని నిరంతరాయంగా నిర్వహించాలని సూచించారు. దోమల లార్వా నిర్మూలన కోసం గాంబుసియా చేపలను చెరువులు, నీటి నిల్వ ప్రాంతాల్లో వదలడంతో పాటు ఆయిల్ బాల్స్ వినియోగాన్ని విస్తరించాలని చెప్పారు. గత సంవత్సరాల్లో నమోదైన వ్యాధుల ధోరణులను విశ్లేషించి అధిక ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు సురక్షిత ఆహారం అందేలా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రతా తనిఖీలను మరింత విస్తరించాలని సూచించారు. గతంలో లోపాలు గుర్తించిన సంస్థల్లో తిరిగి తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వ్యాధుల నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీధి కుక్కల నియంత్రణ చర్యలపై కూడా సమావేశంలో చర్చించారు. కుక్కలకు యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు జంతు జనన నియంత్రణ (ఏబీసీ) కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. మృత జంతువుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా జంతు దహన కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి సర్కిల్‌లో ప్రజారోగ్యం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్దేశిత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అమలు కావాలని, క్షేత్రస్థాయిలో అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి, పారిశుధ్య నిర్వహణలో రాజీ పడకుండా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
