A place where you need to follow for what happening in world cup

- Advertisement -

నోటీసులు లేకుండా కూల్చివేతలా?.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

0 178

నోటీసులు లేకుండా కూల్చివేతలా?.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
– ప్రభుత్వ భూమిగా ఎవరు నిర్ధారించారో వివరాలు సమర్పించాలని ఆదేశం

సైబరాబాద్ – విశాల భారతి
నోటీసులు జారీ చేయకుండా ఆకస్మికంగా కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు హైడ్రా, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలకు కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కల్పించకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నంబర్ 60లోని 350 గజాల స్థలం చుట్టూ ఉన్న హద్దుగోడ, వాచ్‌మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పెమ్మసాని సుధారాణి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైడ్రా దాఖలు చేసిన కౌంటర్‌లోనూ నోటీసులు జారీ చేసినట్లు ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం.. “నోటీసులు ఇస్తే ప్రజలు కోర్టుకు వస్తారని భావించి రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తున్నారా? న్యాయపరమైన అవకాశం కూడా కల్పించరా?” అంటూ అధికారులను ప్రశ్నించింది.

అంతేకాక, ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా ఎవరు నిర్ధారించారని కోర్టు ప్రశ్నించగా, ప్రస్తుత తహసీల్దార్ తనకు ముందు పనిచేసిన అధికారి ప్రభుత్వ భూమిగా గుర్తించారని తెలిపారు. దీంతో సంబంధిత మాజీ తహసీల్దార్ పూర్తి రికార్డులతో కోర్టు ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

కేసు తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం, కూల్చివేతల విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు చట్టపరమైన అవకాశాన్ని కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.