అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
– బాగ్ అమీర్ వార్డు కార్యాలయం ముందే రోడ్డు ఆక్రమణ
– నెలరోజులుగా ఫిర్యాదు పెండింగ్
– ప్రభుత్వ వనరుల దుర్వినియోగంపై స్థానికుల ఆగ్రహం
కూకట్‌పల్లి-విశాల భారతి
కూకట్‌పల్లిలోని బాల్ అమీర్ వార్డు కార్యాలయం ఎదుటే రోడ్డు, పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, టీ స్టాల్ నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచినా “చూస్తాం.. చర్యలు తీసుకుంటాం” అనే హామీలకే పరిమితమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
కూకట్‌పల్లిలోని బాగ్ అమీర్ వార్డు కార్యాలయం పరిసరాల్లో రోడ్డు, కార్యాలయ పార్కింగ్ ప్రాంతాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, టీ స్టాల్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయానికి చెందిన విద్యుత్, నీటి సదుపాయాలను వినియోగిస్తూ ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమస్యపై స్థానికుడు శ్రీనివాస్ జూలై 9న జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.అయితే నెల రోజులు గడిచినా ఆక్రమణ తొలగించకపోగా, సంబంధిత అధికారులు కేవలం హామీలకే పరిమితమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లో ఫిర్యాదును పరిష్కరించినట్లు నమోదు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి యథాతథంగానే ఉందని పేర్కొంటున్నారు.స్థానికుల కథనం ప్రకారం, ఈ వ్యవహారంపై ఆల్విన్ కాలనీ సర్కిల్ ఉప కమిషనర్ చాముండేశ్వరి దృష్టికి కూడా పలుమార్లు తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కిల్ కార్యాలయానికి పలుమార్లు వెళ్లి వినతులు ఇచ్చినా అధికారులు కేవలం “చూస్తాం.. చర్యలు తీసుకుంటాం” అనే మాటలకే పరిమితమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కూకట్‌పల్లి సర్కిల్‌కు చెందిన ఓ శానిటేషన్ జవాన్ అక్రమ ఫాస్ట్‌ఫుడ్, టీ సెంటర్ల నిర్వాహకులకు అండగా నిలుస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎంటమాలజీ విభాగానికి చెందిన కొందరు సిబ్బంది కూడా ఇటువంటి అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాల్సింది పోయి, దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఈ అంశాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి విచారణ గానీ, చర్యలు గానీ కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా, ప్రభుత్వ విద్యుత్, నీటి వనరులు దుర్వినియోగం అవుతున్నా, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయం ఎదుటే ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంటే నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలను ఎలా అరికడతారని ప్రశ్నిస్తున్నారు. అలాగే సంబంధిత అధికారులకు, ఆక్రమణదారులకు మధ్య ఏదైనా అవగాహన ఉందా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ భూమి, పార్కింగ్ స్థలాన్ని వెంటనే ఆక్రమణ నుంచి విముక్తి చేసి, బాగ్ అమీర్ వార్డు కార్యాలయం ఎదుట కొనసాగుతున్న అక్రమ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, టీ స్టాల్ ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఆక్రమణలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
