నిర్మాణ వ్యర్థాలకు ఇక చెక్!
– రోడ్లపై పడేయకుండా ‘రీకలెక్ట్’ యాప్‌తో సులభంగా తరలింపు
– సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థ
సైబరాబాద్, విశాల భారతి
కొత్త భవనం నిర్మాణంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చర్యలు చేపట్టింది. నిర్మాణ, కూల్చివేతల సమయంలో వెలువడే వ్యర్థాలను రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో అక్రమంగా పడేయకుండా సులభంగా తరలించేందుకు ‘రీకలెక్ట్’ యాప్ ద్వారా సేకరణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇళ్ల నిర్మాణం, మరమ్మతులు, భవనాల కూల్చివేతల సమయంలో వెలువడే మట్టి, ఇటుకలు, కాంక్రీట్, ఇతర నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బాధ్యతాయుతంగా పారవేయాలని సీఎంసీ సూచించింది. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి రీకలెక్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తమ ప్రాంతంలో ఉన్న నిర్మాణ వ్యర్థాల సేకరణ కోసం యాప్‌లోనే బుకింగ్ చేసుకోవచ్చు.యాప్ ద్వారా అభ్యర్థన అందిన అనంతరం సీఎంసీ అధీకృత సేకరణ వ్యవస్థ ద్వారా వ్యర్థాలను సంబంధిత ప్రదేశం నుంచి తరలించేలా ఏర్పాట్లు ఉంటాయి. తద్వారా నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్‌కు అడ్డుకట్ట వేయడంతో పాటు రోడ్లు, కాలనీలు, ఖాళీ స్థలాలు పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది.‘నిర్మాణం బాధ్యతగా.. వ్యర్థాల నిర్వహణ మరింత బాధ్యతగా’ అనే లక్ష్యంతో ప్రజలు నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను రోడ్లపై పడేయకుండా రీకలెక్ట్ యాప్ ద్వారా సేకరణకు బుక్ చేసుకోవాలని సీఎంసీ అధికారులు కోరారు.
