సైబరాబాద్ ప్రజావాణిలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
– 43 సమస్యలపై కమిషనర్ స్వయంగా సమీక్ష
– గ్రీవెన్స్ ఐడీతో పారదర్శక పరిష్కారానికి ఆదేశం
సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పౌరుల నుంచి విశేష స్పందన లభించింది. కమిషనర్ స్వయంగా పౌరుల సమస్యలు, వినతులు, సూచనలను స్వీకరించి శాఖాధిపతుల సమక్షంలో సమీక్షించారు.సోమవారం ప్రజావాణిలో మొత్తం 43 ఫిర్యాదులు అందాయి. వాటిలో టౌన్ ప్లానింగ్ శాఖకు సంబంధించి 31, ఇంజినీరింగ్ విభాగానికి 11, క్రీడల శాఖకు 1 ఫిర్యాదు వచ్చాయి. ప్రతి వినతిని కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రతి ఫిర్యాదును ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ, ట్రాకింగ్ లింక్‌తో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పౌరులు తమ ఫిర్యాదు పురోగతిని పారదర్శకంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అన్ని శాఖలు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి ఫిర్యాదుపై సకాలంలో చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
