మాదకద్రవ్యాల రహిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
– బ్రహ్మకుమారీస్ కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వరావు
కూకట్‌పల్లి – విశాల భారతి కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ స్పందన్ కార్యక్రమంలో భాగంగా “10 కోట్ల మాదకద్రవ్యాల రహిత ప్రతిజ్ఞ” ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.
రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉద్యమానికి ఇచ్చిన సందేశం దేశ యువతకు మార్గదర్శకమని అన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే ప్రతి యువకుడు తన ప్రతిభ, శక్తితో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాడని ప్రధాని పేర్కొన్నారని గుర్తు చేశారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం సామాజిక బాధ్యత మాత్రమే కాకుండా జాతీయ కర్తవ్యమని స్పష్టం చేశారు.మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబాలను బలహీనపరుస్తుందని, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి దేశ యువశక్తిని దూరం చేస్తుందని ఆయన అన్నారు. అందుకే ప్రతి కుటుంబం, విద్యాసంస్థ, సామాజిక సంస్థ కలిసి మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించి యువతను సరైన మార్గంలో నడిపించాలని పిలుపునిచ్చారు.బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్యాత్మిక అవగాహన, విలువలతో కూడిన విద్య, రాజయోగ ధ్యానం ద్వారా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యతిరేక చైతన్యాన్ని తీసుకెళ్తుండటం అభినందనీయమని కొనియాడారు. ఆగస్టు 6 నుంచి 20 వరకు జరిగే “10 కోట్ల మాదకద్రవ్యాల రహిత ప్రతిజ్ఞ” కార్యక్రమంలో జన్ భాగీదారి స్ఫూర్తితో ప్రతి పౌరుడు పాల్గొని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నశా ముక్త్ భారత్ అవసరమని, ఆరోగ్యవంతమైన యువతే దేశానికి నిజమైన సంపద అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, యువత, మహిళలు, స్థానిక ప్రముఖులు పాల్గొని మాదకద్రవ్యాల రహిత భారత నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిర్వాహకులు వడ్డేపల్లి రాజేశ్వరావును సన్మానించారు.
