హిజ్రాల హంగామా.. రూ.50 వేల డిమాండ్!
– గృహప్రవేశ వేడుకలో బెదిరింపుల ఆరోపణలు
– సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో.. పోలీసుల స్పందనపై ఉత్కంఠ
సైబరాబాద్ – విశాల భారతి
కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఆనందం.. అంతలోనే కొందరి హంగామాతో ఆ కుటుంబం ఆందోళనకు గురైన ఘటన చింతల్‌లో చోటుచేసుకుంది. గృహప్రవేశ వేడుకలోకి వచ్చిన కొందరు హిజ్రాలు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశారని బాధిత మహిళ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాధితురాలి కథనం ప్రకారం.. డబ్బులు ఇవ్వాలని పట్టుబడుతూ ఇంటి ఎదుటే బైఠాయించారని, అభ్యంతరకరమైన మాటలతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో వేడుకకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు.
ఫిర్యాదులపై చర్యలేవీ..?
ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతుండగా.. ఇలాంటి ఘటనలు గతంలోనూ ఎదురయ్యాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. శుభకార్యాలు జరిగే ఇళ్ల వద్దకు గుంపులుగా వచ్చి భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. అయితే ప్రతి ఘటనలోనూ సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
వైరల్ వీడియోతో కలకలం…
చింతల్ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల స్పందనపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు ఇరుపక్షాల వాదనలు తెలుసుకుని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్ సమాజం మొత్తాన్ని నిందించకుండా, వసూళ్లు లేదా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్
శుభకార్యాల సమయంలో బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేసేలా తగిన వ్యవస్థ ఏర్పాటు చేసి, ఆరోపణలు నిజమని తేలితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
