వీఎన్ఆర్ కళాశాల ఘటనపై మానవ హక్కుల కమిషన్ కేసు
– యాజమాన్యం, పోలీసుల తీరుపై డా. ఆర్.ఎన్. శంకర్ ఫిర్యాదు
సైబరాబాద్ – విశాల భారతి
వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంది. కళాశాల యాజమాన్యం, పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నేత డా. ఆర్.ఎన్. శంకర్ చేసిన ఫిర్యాదుపై కమిషన్ కేసు నమోదు చేసింది.
బాధితురాలి తల్లి గత ఫిబ్రవరి 28న బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కళాశాల యాజమాన్యం తగిన చర్యలు తీసుకోలేదని డా. శంకర్ ఆరోపించారు. ఇద్దరు విద్యార్థులను నిందితులుగా పేర్కొని రిమాండ్ చేసినప్పటికీ యాజమాన్యం పాత్రపై సమగ్ర దర్యాప్తు జరగలేదని పేర్కొన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మే 30న జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు.
ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ ఈ నెల 11న కేసు నమోదు చేసింది. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డా. శంకర్ డిమాండ్ చేశారు.
