నాడు అక్రమం.. నేడు సక్రమం
– మక్త మహబూబ్‌పేట్‌లో పార్క్ స్థలంలో భారీ అక్రమ కట్టడం
– నిలిపేసినా మళ్లీ పనులు.. ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై ఆరోపణలు
– సర్కిల్-48 టౌన్ ప్లానింగ్‌పై ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
సైబరాబాద్ – విశాల భారతి
మక్త మహబూబ్‌పేట్ గ్రామ సర్వే నంబర్ 119 లోని పార్క్ స్థలాన్ని కొంత ఆక్రమించి నిర్మిస్తున్న భారీ అక్రమ భవనాన్ని గతంలో మియాపూర్ సర్కిల్-48 అధికారులు నిలిపివేశారు. భవన నిర్మాణ సామగ్రిని పూర్తిగా సీజ్ చేసి సర్కిల్ కార్యాలయానికి తరలించి పనులను పూర్తిగా నిలువరించారు.అయితే కొన్ని రోజులు ఆగినట్లే ఆగి, తిరిగి అంతే వేగంతో పనులు పుంజుకొని నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో సర్కిల్-48లోని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.దీనిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ‘నోటీసులు ఇచ్చాం, పనులు ఆపేస్తాం’ అంటూ కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీశారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
*నోటీసులు, సీజింగ్‌ల పేరుతో కాలయాపన*
సర్కిల్-48లో ప్రతినిత్యం నోటీసులు, సీజింగ్‌ల పేరుతో కాలయాపన చేస్తూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, న్యాక్ సిబ్బంది ఒకరిపై ఒకరు నెపం నెట్టుతూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*ప్రజావాణిలో అత్యధిక ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్‌పైనే*
ప్రధానంగా సర్కిల్ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అత్యధికంగా ఫిర్యాదులు ఒక్క టౌన్ ప్లానింగ్ విభాగంపైనే నమోదవడం గమనార్హం. ప్రజావాణి సమస్యలు బుట్టదాఖలు అవుతున్నాయే తప్ప చర్యలకు ఉపక్రమించడం లేదని స్థానికులు వాపోతున్నారు. కేవలం టౌన్ ప్లానింగ్‌పైనే ప్రధానంగా ఎక్కువ ఆరోపణలు, ఫిర్యాదులు రావడం ఈ సర్కిల్‌కు కొత్తేమీ కాదని చర్చించుకుంటున్నారు.
*చక్రం తిప్పేది ఔట్‌సోర్సింగ్ సిబ్బందేనా?*
ఎంతమంది అధికారులు మారినా ఈ సర్కిల్‌లో చక్రం తిప్పేది ఓ ఔట్‌సోర్సింగ్ సిబ్బందేనని మరోసారి తేటతెల్లమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీసీ శ్రీనివాస్ సదరు సిబ్బందిపై చర్యలు తీసుకొని ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
