A place where you need to follow for what happening in world cup

- Advertisement -

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత

0 106

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత
– మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఆలస్యం
– ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలకు రాత్రి వరకు పోస్టుమార్టం చేయని వైనం
– డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో అందుబాటులో లేక కుటుంబ సభ్యుల ఆందోళన

జహీరాబాద్ – విశాల భారతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామం సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు సాయంత్రం వరకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయం సుమారు 10.30 గంటలకు ప్రమాదం జరిగినప్పటికీ రాత్రి 8 గంటల వరకు పోస్టుమార్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే గంటలు గడుస్తున్నా పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందించాల్సిన సమయంలో డ్యూటీ డాక్టర్‌తో పాటు సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో కూడా అందుబాటులో లేరని వారు ఆరోపించారు. దీంతో చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా సజ్జాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు డీసీఎం యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పించాలని బంధువులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై, అనంతరం జహీరాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించి కోహిర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు విషయంలోనూ తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కోహిర్ ఎస్‌ఐ తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం లేదని పేర్కొంటూ జహీరాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ తమ కుటుంబాల్లోని ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. దళితుల ప్రాణాలకు విలువ లేదా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు డీసీఎం యజమాని నుంచి తగిన నష్టపరిహారం ఇప్పించాలని, తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయని కోహిర్ ఎస్‌ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, పోస్టుమార్టం ఆలస్యం కావడంపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.