మియాపూర్‌లో భక్తిశ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
– ప్రశాంత్ నగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం
– జీయర్ స్వాముల ఆశీస్సులతో విశేషంగా నిర్వహించిన సంస్కార వికాస్ కార్యక్రమం
సైబరాబాద్ – విశాల భారతి
మియాపూర్‌లోని ప్రశాంత్ నగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. సంస్కార వికాస్, మియాపూర్ జోన్, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీమహావిష్ణువును భక్తిపూర్వకంగా ప్రార్థించారు.శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో పాటు, శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల జీయర్ స్వామి వారి అనుగ్రహ భాషణం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జీయర్ స్వాములు సనాతన ధర్మ పరిరక్షణ, కుటుంబాల్లో ఆధ్యాత్మిక విలువల పెంపు, నిత్య జీవితంలో విష్ణు సహస్రనామ పారాయణం ప్రాముఖ్యతను వివరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంలో మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో ధార్మిక చైతన్యం పెంపొందించడం, యువతలో భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన భక్తులు, సేవకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
