గచ్చిబౌలి ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
– ఆరో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి బలవన్మరణం..?
– అనారోగ్యం, కుటుంబ సమస్యలే కారణమా..?
– ఖమ్మం జిల్లా విద్యార్థిగా గుర్తింపు
సైబరాబాద్ – విశాల భారతి
గచ్చిబౌలిలోని ఐఐఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి అక్కడికక్కడే మృతిచెందాడు.మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుద్(20)గా పోలీసులు గుర్తించారు. అతడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యం, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. శనివారం తెల్లవారుజామున తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతితో తోటి విద్యార్థులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.
