A place where you need to follow for what happening in world cup

- Advertisement -

పట్టా భూమి పంచాయతీలో తహసీల్దార్ హస్తం 

0 167

విశాలభారతి, స్టేట్ బ్యూరో: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో రెవెన్యూ యంత్రాంగం తీరు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూములను, అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్, భూదాన్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన తహసీల్దార్, అందుకు భిన్నంగా ప్రైవేటు పట్టా భూముల్లో తలదూర్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వెలుగుపల్లి గ్రామంలోని ఒక భూ వివాదాన్ని సాకుగా తీసుకుని, సూర్యాపేటలోని తిరుమల హోటల్‌ను అడ్డాగా మార్చుకుని సెటిల్మెంట్లు సాగిస్తున్నారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. భూ రికార్డులను సక్రమంగా నిర్వహించాల్సిన అధికారిణి, అక్రమార్కులకు వంతపాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో ఓ భూ వివాదంలో తహసీల్దార్ తలదూర్చడం వలన వ్యక్తి మరణించాడనే కథనాలు వెలువడ్డాయి.

తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 297లో గల 16 ఎకరాల 4 గుంటల భూమి ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. 2008వ సంవత్సరంలోనే సాయిని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి స్థానిక రైతుల వద్ద నుండి ఈ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఈ భూమికి సంబంధించిన క్రయవిక్రయాలు సజావుగానే సాగాయి. కొనుగోలు చేసిన భూమిని సదరు వ్యక్తి ఇతరులకు విక్రయించగా, ప్రస్తుతం ఆ భూమి సాగులో ఉంది. అయితే, సుమారు 17 ఏళ్ల పాటు మౌనంగా ఉన్న కొందరు వ్యక్తులు, ఇప్పుడు అకస్మాత్తుగా రంగంలోకి దిగి తామే వారసులమంటూ హడావుడి చేయడం వెనుక తహసీల్దార్ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ భూ వివాదంలో తహసీల్దార్ స్వయంగా మధ్యవర్తిత్వం వహిస్తూ, పాత పాస్ బుక్ పత్రాలను సృష్టించి లేని వివాదాన్ని తెరపైకి తెచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్టప్రకారం రికార్డులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ, కేవలం కాసుల కక్కుర్తితోనే అధికారులు పాత పత్రాలను తవ్వి తీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో విక్రయించిన భూమికి ఇప్పుడు వారసులమంటూ వస్తున్న వారికి తహసీల్దార్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, వారి ద్వారా ప్రస్తుత యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ఒక మహిళా మధ్యవర్తి పాత్ర కీలకంగా ఉందని, ఆమెతో కలిసి తహసీల్దార్ పథక రచన చేస్తున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

సూర్యాపేట పట్టణంలోని తిరుమల హోటల్ ఈ అక్రమ పంచాయతీలకు వేదికగా మారింది. కార్యాలయంలో ఉండాల్సిన సమయంలో కాకుండా, హోటల్ గదుల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేయడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బాధితులను హోటల్‌కు పిలిపించుకుని, అక్కడ భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం కల్పించిన అధికారాలను అడ్డం పెట్టుకుని, బడా వ్యాపారులతో చేతులు కలిపి సాధారణ రైతులకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించడంలో తహసీల్దార్ ఆరితేరిపోయారని, లేని హక్కులను ఉన్నట్టుగా చూపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

వాస్తవానికి ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములపై కన్నెత్తి చూడని రెవెన్యూ యంత్రాంగం, కేవలం విలువైన ప్రైవేటు భూములపైనే ఆసక్తి చూపడం వెనుక ఉన్న మర్మం అందరికీ అర్థమవుతూనే ఉంది. వెలుగుపల్లి భూమి విషయంలో 17 ఏళ్లుగా లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయనే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పాత రికార్డులను తారుమారు చేసి, కొత్తగా వారసులను పుట్టించి, ఆ భూమిని వివాదంలోకి నెట్టడం ద్వారా అక్రమ సంపాదనకు తెరలేపారని బాధితులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ తతంగం వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందని, తహసీల్దార్ దానికి నాయకత్వం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

భూమి కొనుగోలు చేసిన వారు తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలను చూపించినప్పటికీ, అధికారులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైగా, ఎదుటి పక్షం దగ్గర ఉన్న చెల్లని పాత పత్రాలను హైలైట్ చేస్తూ ఫీల్డ్ ఎంక్వయిరీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. తహసీల్దార్ వ్యవహారం వల్ల భూ యజమానులు మానసిక వేదనకు గురవుతున్నారు. అధికారుల అండదండలు చూసుకుని అక్రమార్కులు భూమి పైకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని, అడ్డుకున్న వారిని బెదిరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తహసీల్దార్‌కు అందాల్సిన వాటాల గురించి ఇప్పటికే ఒక స్పష్టమైన ఒప్పందం కుదిరినట్టు వినికిడి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, దానికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియలు పూర్తయ్యాక కూడా ఇలాంటి వివాదాలు సృష్టించడం చట్టవిరుద్ధం. కానీ, తుంగతుర్తి తహసీల్దార్ మాత్రం చట్టాలను తుంగలో తొక్కి తన సొంత నిబంధనలను అమలు చేస్తున్నారు. పట్టా భూముల్లో తలదూర్చి పంచాయతీలు చేసే అధికారం తహసీల్దార్‌కు ఎక్కడిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులే స్వయంగా వివాదాలను సృష్టిస్తుంటే సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల హోటల్ కేంద్రంగా సాగుతున్న ఈ భాగోతం పై ఉన్నతాధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో బహిరంగంగానే ఈ దందాలు సాగుతున్నా కలెక్టర్ కార్యాలయం నుండి ఎలాంటి చర్యలు లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. తహసీల్దార్‌తో సన్నిహితంగా ఉండే సదరు మహిళా మధ్యవర్తి, తాను చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరిస్తూ భూ యజమానులను డిమాండ్ చేస్తున్నారని సమాచారం. భారీ మొత్తంలో నగదు ఇస్తేనే రికార్డుల్లో పేరు మారుస్తామని లేదా వివాదం లేకుండా చూస్తామని తేల్చి చెబుతున్నారట. ఇదంతా తహసీల్దార్ కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆమె ప్రోద్బలం లేనిదే ఆ మహిళా మధ్యవర్తి ఇంతటి సాహసం చేయలేదని భావిస్తున్నారు.

ప్రస్తుతం వెలుగుపల్లి భూ వివాదం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తుంటే భూములకు రక్షణ ఎక్కడుంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాత రికార్డుల పేరుతో కొత్త చిక్కులు సృష్టిస్తున్న తహసీల్దార్‌పై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. కార్యాలయ విధులు వదిలి హోటళ్లలో సెటిల్మెంట్లు చేస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందా లేదా అన్న కోణంలో ఫోరెన్సిక్ దర్యాప్తు చేయిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తుంగతుర్తి తహసీల్దార్ తీరుపై విచారణ జరపాలి. వెలుగుపల్లి సర్వే నెంబర్ 297లో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, అసలైన పట్టాదారులకు న్యాయం చేయాలి. తిరుమల హోటల్ అడ్డాగా సాగుతున్న చీకటి వ్యాపారాలను అడ్డుకుని, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ భూ వివాదంలో సూత్రధారులు, పాత్రధారులందరినీ చట్టం ముందు నిలబెట్టాలని సూర్యాపేట జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.