ఫ్లెక్సీల మాయాజాలం.. ప్రజల ప్రాణాలకు లేదు పైరం
ఫ్లెక్సీల మాయాజాలం.. ప్రజల ప్రాణాలకు లేదు పైరం
– హైదర్‌నగర్‌లో పోటాపోటీ కటౌట్లు, బ్యానర్లు
– ఫ్లెక్సీలు.. బ్యానర్లతో పొంచి ఉన్న ప్రమాదం
– గాలిదుమారానికి ఎగిరితే పడి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
– అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
సైబరాబాద్ – విశాల భారతి
హైదర్‌నగర్ డివిజన్ పరిధిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదర్‌నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి రెయిన్‌బో ఆసుపత్రి వరకు జాతీయ రహదారిని ఆనుకుని పోటాపోటీగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు రహదారి భద్రతకు ముప్పుగా మారాయని పలువురు ఆరోపిస్తున్నారు.
గాలిదుమారంతో ఎక్కడ పడతాయో?
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఒక్కసారిగా ఈదురుగాలులు, వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. బలమైన గాలులకు ఫ్లెక్సీలు, కటౌట్లు ఊడిపోయి రోడ్డుపై పడితే బాటసారులు, ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై పడిన బ్యానర్లను తప్పించుకునే క్రమంలో వాహనాలు అదుపుతప్పి పరస్పరం ఢీకొనే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోటాపోటీ ప్రచారం.. పట్టించుకోని అధికారులు
ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు, వివిధ సంస్థలు ప్రచారంలో పోటీపడి భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా వాటి పటిష్ఠత, భద్రతా ప్రమాణాలను పరిశీలించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
ప్రచారం కోసం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. కానీ నిబంధనలు పాటించకుండా రహదారుల వెంట ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యత ఎవరిది? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
కఠిన చట్టం.. బాధ్యులపై చర్యలు కావాలి
అనుమతులు లేకుండా లేదా భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ప్రమాదకరంగా ఉన్న వాటిని తక్షణమే తొలగించి, వాటిని ఏర్పాటు చేసిన వ్యక్తులు, సంస్థలు లేదా నిర్వాహకులపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల ప్రాణాల కంటే ఏ రాజకీయ ప్రచారమూ ముఖ్యమేమీ కాదని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రమాదకర ఫ్లెక్సీలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
