హైదరాబాద్ పోలీస్ అకాడమీలో కలకలం
– ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు
– తోటి మహిళా ట్రైనీ అధికారిణి ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసుల కేసు నమోదు
రాజేంద్రనగర్ – విశాల భారతి
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు.ఫిర్యాదు ప్రకారం, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనకు నిరంతరం అసభ్యకర సందేశాలు పంపుతూ, మానసికంగా వేధించడంతో పాటు దుర్భాషలాడుతున్నాడని బాధితురాలు పేర్కొన్నారు. జూలై 9న జుట్టు పట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని ఆరోపించారు. అలాగే ఆమె వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి, మొబైల్ ఫోన్‌ను తీసుకుని ఆ వీడియోలను ఆమె భర్తకు వాట్సాప్ ద్వారా పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 74, 75, 77, 315(2)తో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేశారు. నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేసి, కేసుపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రంగా గుర్తింపు పొందిన జాతీయ పోలీస్ అకాడమీలో ఈ ఘటన వెలుగుచూడడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
