మియాపూర్-కొండాపూర్ మార్గంలో భారీగా నిలిచిన వాహనాలు
– ప్రయాణికులకు తప్పని తిప్పలు
సైబరాబాద్ – విశాల భారతి
మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జెన్‌పాక్ట్ ఇండియా నుండి కొండాపూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వారంలో మొదటి రోజు కావడంతోపాటు కార్యాలయాలకు వెళ్లే వేళల్లో ఈ రద్దీ ఏర్పడటంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్లపై కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రంగంలోకి దిగారు. రద్దీ ఎక్కువగా ఉన్న కీలక కూడళ్ల వద్ద అదనపు సిబ్బందిని మోహరించి రాకపోకలను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. రహదారిపై నిలిచిన వాహనాలను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొద్దిసేపట్లోనే రవాణా సాధారణ స్థితికి వస్తుందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. వాహనదారులు సహనం పాటించి, సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
