లండన్ నుంచి రాగానే యూట్యూబర్ నందన అరెస్టు
– లుక్‌ఔట్ నోటీసులతో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి
– ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగింత
సైబరాబాద్ – విశాల భారతి
లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ నుంచి విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. నందనపై గతంలోనే లుక్‌ఔట్ నోటీసులు జారీ కావడంతో విషయాన్ని ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నందనను తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. నందన దంపతులు లండన్‌లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
