A place where you need to follow for what happening in world cup

- Advertisement -

హిడ్మా ఎన్‌కౌంటర్‌

0 645

విశాలభారతి, నేషనల్: మావోయిస్ట్‌లకు షాక్‌ తగిలింది. మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. గ్రే హౌండ్స్ బలగాల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత హిడ్మా మృతి చెందాడు. తెలంగాణ గ్రే హౌండ్స్ ఆపరేషన్‌లో బీజాపూర్ తెలంగాణ బార్డర్ లో ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రే హౌండ్స్, సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా ఆధ్వర్యంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే.. హిడ్మాపై రూ.45 లక్షల రివార్డు ఉంది. 1996-97లో మావోయిస్టు పార్టీలో హిడ్మా చేరాడు. ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా హిడ్మా వ్యవహరించాడు.

హిడ్మా స్వగ్రామం ఛత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి. ఇతనికి సంతోష్, హిద్మల్లు వంటి మారు పేర్లు ఉన్నాయి. 7వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా ఉద్యమంలోకి రాక ముందు వ్యవసాయం చేసేవాడు. మావోయిస్టు పార్టీతో పని చేసిన ఓ లెక్చరర్ ద్వార ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఆయుధాల తయారీ, రిపైర్ వర్క్‌లో నిపుణుడిగా మారాడు హిడ్మా. 2007లో ఉర్పల్ మెట్ట వద్ద సీఆర్పీఎఫ్‌పై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించాడు హిడ్మా. ఇదిలా ఉంటే.. హిద్మా మృతిని ఇంకా మావోయిస్టు కేంద్ర కమిటీ ధ్రువీకరించలేదు.

దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా… ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా… తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే… పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా  కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది.

2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది CRPF జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి

చాలాకాలం పాటు పోలీసులకు ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్తపడిన హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని… దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు.

పార్టీ పుట్టుక నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్రకమిటీలో ఒక్క గోండు కూడా లేడు. ఛత్తీస్‌ఘడ్‌లో ప్రస్తుతం 80శాతం మావోయిస్టులు గోండు తెగకు చెందిన గిరిజనులే. అయితే వీరికి నాయకత్వం ఇవ్వడంతో పార్టీలో పెద్ద చర్చ జరిగింది. వీరిలో చాలామందికి సైద్ధాంతిక ప్రాతిపదిక లేదని కొందరు విమర్శించారు. కేవలం చంపడంపైనే శిక్షణ పొందిన వీరు పార్టీని నడపలేరని చెబుతారు. ఇలాంటి సందర్భంలోనే హిడ్మా కేంద్ర కమిటీలోకి రావడం వల్ల… ఛత్తీస్ఘడ్ మావోయిస్టు పార్టీలో స్థానిక గిరిజనులు నాయకత్వం తీసుకోడానికి ఒక అవకాశంగా మారింది.

హిడ్మాను ఎవరూ చంపలేరని మావోయిస్టు పార్టీలో ఒక గుడ్డి నమ్మకం ఉంది. ఇప్పుడు హిడ్మా చనిపోతే అది క్యాడర్‌కు కూడా నైతికంగా ఎదురు దెబ్బేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో చాలా ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా… ఎన్‌కౌంటర్లో ఎలా చనిపోతారనే చర్చ జరుగుతోంది. గతంలో చాలాసార్లు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే హిడ్మా బ్రతికే ఉన్నాడని తర్వాత తేలింది. ప్రస్తుత హిడ్మా ఎన్కౌంటర్‌పై ఇప్పటివరకు తెలంగాణ -ఛత్తీస్గడ్ పోలీసులు ఎలాంటి ధృవీకరణ చేయలేదు. అటు మావోయిస్టు పార్టీ  కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.

Leave A Reply

Your email address will not be published.